భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రకటించారు. శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కార్పొరేషన్ సాధనకు చేసిన కృషిని గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని కూనంనేని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బొగ్గు, విద్యుత్, అటవీ, ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలకు అడ్డంకులు తొలిగిపోయాయని, ప్రజలకు కార్పొరేషన్ రూపంలో అభివృద్ధి ఫలాలు అందించినందుకు హర్షం వ్యక్తమవుతోందన్నారు