సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం తగదని పేర్కొంది. ‘‘ప్రజాస్వామ్యంలో పోలీసుల రాజ్యంగా వ్యవస్థ పని చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. చిన్న కేసుల్లో బెయిల్ నిరాకరణ కారణంగా అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోందని జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఒక చిన్న కేసులో రెండేళ్లుగా కస్టడీలో ఉన్న నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, గుజరాత్ హైకోర్టు, ట్రయల్ కోర్టు దాన్ని తిరస్కరించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేజిస్ట్రేట్ స్థాయిలో పరిష్కరించాల్సిన బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టుకు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారంగా వ్యవహరించాలని సూచించింది.