ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మహా కుంభమేళా విజయం గురించి ప్రసంగిస్తూ, ఇది ప్రజలందరి కృషి ఫలితమని, భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. కుంభమేళా విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని, ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచిందని అన్నారు. కుంభమేళా మన సామర్థ్యంపై అనుమానాలను పటాపంచలు చేసిందని, ఆధ్యాత్మిక ఐక్యత కోసం దేశమంతా ఒకచోటుకు వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు.
మోదీ మాట్లాడుతూ, కుంభమేళా జలాలను మారిషస్‌కు బహుమతిగా ఇచ్చామని, అక్కడ ఉత్సవ వాతావరణం నెలకొందని వెల్లడించారు. పొరుగు దేశాల నుంచి విశేష ఆదరణ లభించిందని, ప్రయాగ్‌రాజ్‌ను వారి నాయకులు సందర్శించారని తెలిపారు. మహా కుంభమేళా భారత సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిందని, భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ ప్రత్యేకత అని గుర్తుచేశారు. ఈ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా నదులకు ఉత్సవాలు నిర్వహించాలని, మన నదులను రక్షించుకోవాలని ప్రజలను కోరారు.