రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా అన్ని బోర్డుల పాఠశాలల్లోనూ 2025-26లో తొమ్మిదో తరగతి, 2026-27లో పదో తరగతి విద్యార్థులకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో చట్టం ద్వారా అమలుకి వచ్చిన ఈ నిబంధనను గత ప్రభుత్వం పర్యవేక్షించలేదని, తాజా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంకల్పించిందని తెలిపారు. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో ప్రామాణిక తెలుగు స్థానంలో సరళమైన ‘వెన్నెల’ తెలుగు ప్రవేశపెట్టారు. ఇది మాతృభాషేతర విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా ఉపయోగకరమని పేర్కొన్నారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు బోధన, పరీక్షలు తప్పనిసరి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.