మక్కల్ నిది మయ్యమ్ (ఎంఎన్‌ఎమ్) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎం.కె. స్టాలిన్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. జులైలో డీఎంకేకు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, కమల్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఎంకే యోచిస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కమల్, కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగాలని భావించగా, బీజేపీ నేత అన్నామలై పోటీకి దిగడంతో చివరి నిమిషంలో వెనుకంజ వేశారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.ఇక తమిళ సినీ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో, 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.