కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956 సెక్షన్ 3) ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలని చెప్పారు. ఢిల్లీలో జరిగిన సమీక్షలో నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (2014) సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయాలి.
గోదావరి-బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖలు రాయాలి. భద్రాచలం ముంపు సమస్యపై హైదరాబాదు IITతో అధ్యయనం వేగవంతం చేయాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతులను త్వరితగతిన సాధించాలి. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.