చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు మరొకసారి భయాందోళనకు గురవుతున్నాయి. గతంలో చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలిగించిన ప్రాణ నష్టం ఇంకా గుర్తుండగానే, ఇప్పుడు కొత్త వైరస్ అనుమానాలు కలిగిస్తుండడం ప్రజలలో ఆందోళనను పెంచుతోంది.
తెలంగాణ సర్కార్ ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్క్ ధరించాలని, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు జనసమూహాలకు దూరంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ప్రస్తుతం తెలంగాణలో నమోదు కాలేదని, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలో, వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది.
చేయవలసినవి:
- జలుబు, దగ్గు, తుమ్ము ఉన్నప్పుడు నోటి, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేయాలి.
- జ్వరం, దగ్గు, తుమ్ములు ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
- సబ్బుతో లేదా శానిటైజర్‌తో చేతులను తరచూ శుభ్రం చేయాలి.
- ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తులతో దూరం పాటించాలి.
- జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వెళ్లకూడదు.
- ఎక్కువ నీళ్ళు తాగాలి, పౌష్టికాహారం తీసుకోవాలి.
- తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి.
చేయకూడనివి:
- ఇతరులతో కరచాలనం (షేక్ హ్యాండ్) చేయవద్దు.
- ఫ్లూ బారిన పడినవారు ఉపయోగించిన టిష్యూ పేపర్లు, కర్చీఫ్‌లను ఇతరులు వాడరాదు.
- కళ్ళు, నోటి, ముక్కును తరచుగా తాకవద్దు.
- ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించకుండా సొంతంగా మెడిసిన్ వాడకూడదు.
ఈ మార్గదర్శకాలు ప్రజలు స్వయంగా పాటించి, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సహాయపడేలా తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది.