తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన

రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖలో, తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో వందల ఏళ్లుగా ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రస్తావించారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని, ఈ సంఖ్య ఏటా పెరుగుతుందని వివరించారు. గత సంప్రదాయాలను కొనసాగిస్తూ, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు దర్శనాలకు మరియు ఆర్జిత సేవలకు అనుమతి కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు నాయుడు స్పందన

ఈ లేఖలపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపనల మేరకు దర్శనాలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. వీఐపీ బ్రేక్ దర్శనం (రూ. 500/- టికెట్) కోసం ప్రతివారం ప్రతి ప్రజాప్రతినిధి నుంచి రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనం (SED) (రూ. 300/- టికెట్) కోసం రెండు లేఖలు పంపుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించబడుతుందని పేర్కొన్నారు.

భక్తుల అనుభవం సులభతరం

సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ తగ్గించడం, తెలుగు జాతి సత్సంబంధాలు ప్రోత్సహించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయడం నిర్ణయించామని చంద్రబాబు నాయుడు గారు తన లేఖలో పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో, తెలుగు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక సంబంధాలు మరింత బలపడుతాయని, భక్తులకు మరింత సౌకర్యం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.

Loading

By admin

error: Content is protected !!