హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన పేరును వదిలి దేవున్ని తలిస్తే స్వర్గానికి వెళతారని చేసిన వ్యాఖ్యలను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెలిశాల శ్యామ్ మహర్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా శ్యామ్ మహర్ మాట్లాడుతూ, నవభారత నిర్మాత డా. అంబేడ్కర్ తన కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగాన్ని అందించారని, ఆ రాజ్యాంగం ద్వారా అమిత్ షా వంటి వారు ఓటు హక్కు మరియు పదవులు పొందారని గుర్తు చేశారు. అంబేడ్కర్ పేరును ప్రస్తావించడాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని, ఈ వ్యాఖ్యలు హేయమైనవని పేర్కొన్నారు.
అంబేడ్కర్‌ను ఒక వర్గానికే పరిమితం చేయాలనే ప్రయత్నాలు తగవని, అటువంటి వారు మహనీయుడి జీవిత చరిత్రను పూర్తిగా చదవాలని సూచించారు. అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అమిత్ షా ఇంటి ముట్టడికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.