Oplus_131072

కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాలల సింహగర్జన సభ విజయవంతం కావడంతో పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 1, 2024న నిర్వహించిన ఈ సభ మాలల ఆత్మ గౌరవం, ఐక్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా సాగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, మాలల హక్కుల సాధన కోసం ఈ భారీ సభను ఏర్పాటు చేశారు.

భారీ ప్రజా జనసందోహం

చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా మాలలు తరలివచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జన సముద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పాశ్వాన్, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, నాగరాజు, ఎంపీ గడ్డం వంశీ తదితరులు హాజరై మాలల ఐక్యతను ప్రోత్సహించారు.

ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలు

సభలో మాట్లాడిన గడ్డం వివేక్, మాలల ఆత్మ గౌరవం కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. “మాలల సింహగర్జన మీటింగ్‌ను చాలామంది అవహేళన చేశారు. కానీ సొంత ఖర్చులతో వచ్చిన ప్రజల సహకారంతో సభను విజయవంతం చేశాం. మన ఆత్మగౌరవం మనమే కాపాడుకోవాలి,” అని ఆయన అన్నారు.

వర్గీకరణపై స్పందన

ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడగొట్టే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. “ఈ దేశంలో 3 వేల ఏళ్లుగా కుల వివక్ష కొనసాగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఇవాళ ఆ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర జరుగుతోంది,” అని విమర్శించారు.

మాలల ఐక్యతకు పిలుపు

మాలల బలాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి చూపించామని వివేక్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనల్ని ప్రాతిపదికగా మాలలు ఐక్యంగా ఉండాలని, హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. “మాలలపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోము,” అని హెచ్చరించారు.

రాజకీయ కుట్రలపై స్పందన

మాలల కోసం తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గబోనని, ఆత్మగౌరవ పోరాటంలో తాను అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. “మాలలు తక్కువగా ఉన్నారని అనుకుంటున్న వారికిది చెంపచెళ్లులాంటిది. రాజకీయ పార్టీల చిన్నచూపుకు ఇది సమాధానం,” అన్నారు.మాలల ఐక్యత, హక్కుల సాధన కోసం జరిగిన ఈ సభ మాలల ఆత్మ గౌరవాన్ని మరింత ఉజ్వలంగా చాటి చెప్పింది.

అలరించిన రేంజర్ల రాజేష్ ఆటపాట

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాలల సింహగర్జన సభలో రేంజర్ల రాజేష్ తన ఆటపాటలతో సభకు హైలైట్‌గా నిలిచారు. ఆయన ప్రదర్శన మాలల ఐక్యత, ఆత్మగౌరవం ప్రతిబింబించేటట్లు ఉండడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

Loading

By admin

error: Content is protected !!