దేవతలలో కెల్లా భక్తసులభుడు ఐనవాడు పరమశివుడు . ఈయనకి భోళాశంకరుడు అనే పేరు కూడా కలదు. "ఓం నమ శివాయః " అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఒక మారేడు దళాన్ని సమర్పించి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోయి కోరిన వరాలను ఇచ్చేసేవాడు శివయ్య మాత్రమే . అప్పుడే కొపం , అప్పుడే శాంతం . అదే శివయ్య గొప్పతనం. శివుడు స్వర్గనరకాదులన్నింటినే గాక ఆత్మకు ఆత్మకు మధ్య కర్మబంధాలను కూడా దహించివేయును. అలాంటి పరమేశ్వరుడి యొక్క పూజ గురించి మీకు వివరిస్తాను. శివుడికి లింగపూజ ప్రధానమైనది. ఎటువంటి లింగాలను పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు సంపూర్ణంగా వివరిస్తాను.
ముందుగా మీకు బాణలింగాల గురించి వివరిస్తాను.
- బాణ లింగాలు –
బాణాసురుడు శివుడిని ప్రత్యక్షం చేసుకుని "మీరు సదా లింగ రూపములో ఇక్కడ ఉండవలెను " అని వరము కోరుకున్నాడు. దానికి శివుడు "తధాస్తు " అన్నాడు. అలా ఏర్పడిన లింగాలకే బాణలింగాలు అని పేరు వచ్చింది. ఒక్క బాణలింగ పూజలోనే నానావిధములు అయిన లింగాలను పూజించిన ఫలితాలు వచ్చును. ఇవి నర్మదా మొదలగు నదులలో లభించును. ఈ బాణ లింగాలకు బంగారు , వెండి , రాగి లోహములతో గాని , స్పటికముతో గాని కడకు పాషాణం (నల్ల రాయి ) తో అయినా వేదికను ఏర్పరిచి దానిపైన పూజించవలెను. ఈ బాణలింగాలను మొదట పరీక్షించి సంస్కారం అనగా శుద్ది చేయవలెను . ఈ బాణలింగాలు అనేక విధములుగా ఉండును. ఇందులో మేఘమువలె ఉండి , కపిలవర్ణము గల లింగము శుభప్రదం అయినది. తుమ్మెద వంటి నీల లింగములను పీఠములున్నను లేకపోయినను , శుద్ది లేకున్నను పూజించవచ్చు. సామాన్యంగా బాణలింగాలు తామరవిత్తుల వలే , పండిన నేరేడు పండ్లవలే , కోడిగుడ్డు ఆకారము వలే ఉండును. కొన్ని తెలుపు మరికొన్ని నలుపు , ఇంకొన్ని తేనె రంగుతో ఉండును. ఈ లింగాలు ప్రశస్తమైనవి.
వివిధ ద్రవ్యాలతో లింగాలను నిర్మించే విధానం గరుడపురాణంలో కనిపించును. ఆయా లింగాల గురించి వాటి పూజించటం వలన కలిగే ఫలితాల గురించి మీకు వివరిస్తాను. - గంధ లింగము – రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు చందనం , మూడు భాగాలు కుంకుమ కలిపి గంధ లింగము తయారుచేయుదురు . దీనిని పూజించిన శివసాయుధ్యం కలుగును.
- పుష్ప లింగము – నానా విధములైన సువాసన కలిగిన పువ్వులతో నిర్మించిన పుష్పలింగమును పూజించిన రాజ్యాధిపత్యం కొరకు పూజిస్తారు.
- గోమయ లింగము – స్వచ్ఛమైన కపిల (నల్ల ) గోమయమును తెచ్చి లింగము చేసి పూజించిన ఐశ్వర్యము చేకూరును . నేలపైన , మట్టిలోన పడిన పేడ పనికిరాదు .
- రజోమయ లింగము – పుప్పొడితో తయారుచేసిన లింగమును పూజించిన దైవత్వం సిద్ధించును . అటుపై శివసాయుజ్యం పొందవచ్చు .
- యవ – గోధుమ – శాలిజ లింగము – యవ గోధుమ తండుల పిండితో చేయబడిన లింగమును పూజించిన సకల సంపదలు కలుగును. పుత్రసంతానం కలుగును.
- తిలాపిష్ట లింగము – నువ్వుల పిండితో లింగము చేసి పూజించిన ఇష్టసిద్ది కలుగును.
- లవణ లింగము – హరిదళం , త్రికటుకాలు మెత్తగా పొడిచేసి ఉప్పుతో కలిపి లింగమును చేసి పూజించిన వశీకరణం ఏర్పడును .
- తుపొత్త లింగము – శత్రు నాశనం చేయును.
- భస్మమయ లింగము –
సమస్త ఫలితాలను ప్రసాదించును.
- గుడోత్త లింగము –
ప్రీతిని కలిగించును.
- శర్కరామయ లింగము –
అన్ని సుఖాలను ఇచ్చును.
- వంశాంకుశమయ లింగము –
అన్ని సుఖాలను చేకూర్చును .
- కేశాస్తి లింగము –
సర్వ శత్రువులను నశింపచేయును .
- పిష్టమయ లింగము – సర్వ విద్యా ప్రదమవును .
- దధి దుగ్దద్భవ లింగము – కీర్తిని , లక్ష్మిని ప్రసాదించును.
- ధాన్యజ లింగము – ధాన్యప్రదం అగును.
- ఫలోత్త లింగము – ఫలప్రదం అగును.
- ధాత్రీ ఫలజాత లింగము – ముక్తిని ప్రసాదించును.
- నవనీత లింగము – కీర్తి , సౌభాగ్యం ప్రసాదించును.
- దూర్వాకాండ లింగము – ఈ లింగమును గరిక కాడలతో తయారుచేస్తారు . దీనిని పూజించుట వలన అపమృత్యువు నశించును.
- కర్పూర లింగము – మోక్షమును అనుగ్రహించును.
- మౌక్తిక లింగము –
సౌభాగ్య ప్రదము .
- అయస్కాంత మణిజ లింగము – సకల సిద్ధులను కలిగించును.
- సువర్ణ నిర్మిత లింగము –
ముక్తిని ప్రసాదించును.
- రజత లింగము – ఐశ్వర్యాన్ని వృద్దిచేయును .
- ఇత్తడి , కంచు లింగములు – ముక్తిదాయకం .
- గాజు , ఇనుము , సీసం లింగములు –
శత్రునాశనం చేయును .
- అష్ఠలోహ లింగము –
కుష్ఠురోగమును నివారించును.
- అష్టధాతు లింగము –
సర్వసిద్ధి కలిగించును.
- స్పటిక లింగము –
సర్వకామ ప్రదము .
ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కాని తామ్రము , సీసం , రక్తచందనం , శంఖం , కాంస్యం , ఇనుము ల తయారైన లింగపూజ ఈ కలియుగము నందు నిషేధించబడినది. పాదరసం తో చేయబడిన లింగము అష్టైశ్వర్యాలను అనుగ్రహించును. ఇది అన్నింటి కంటే మహామహిమ కలిగినది . పారద శబ్దములో ప - విష్ణువు , అ - ఈశ్వరి , పార్వతి - కాశిక , ర - శివుడు , ద - బ్రహ్మ ఇలా అందరూ దానిలో ఉన్నారు . జీవితములో ఒక్కసారైనను పాదరసముతో చేసిన శివలింగాన్ని పూజించిన విజ్ఞానం , అష్టసిద్దులు , ధనధాన్యాలు , సకలైశ్వర్యాలు అన్ని చేకూరును . లింగపూజ యందు పార్వతీపరమేశ్వరులు ఇద్దరికి పూజ జరుగును. లింగమూలము నందు బ్రహ్మ , మధ్యలో విష్ణువు , ఊర్ధ్వభాగము నందు ప్రణవాఖ్య పరమేశ్వరుడు ప్రకాశించుచుందురు . వేదిక (పానపట్టం ) పార్వతి , లింగము పరమేశ్వరుడు . కావున శివలింగ పుజ వలన సర్వదేవతా పూజ జరుగుతుందని లింగపురాణం నందు వివరించబడినది
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034