ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా మహిళా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి రక్షణ కోసం రాత్రి సమయాల్లో షీ టీమ్స్‌తో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను అమలు చేయాలని, అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లకు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.
టిమ్స్ ఆసుపత్రులకు ప్రత్యేక ఆదేశాలు
ప్రతి ఆసుపత్రిలో శాశ్వత సెక్యూరిటీ అవుట్ పోస్టులు నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పది టీచింగ్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టులను నిర్మించామని తెలిపారు. అలాగే, సెక్యూరిటీ హౌజ్‌ను ప్రతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పీహెచ్‌సీ స్థాయి నుంచి అన్ని ఏరియా హాస్పిటల్స్ వరకు సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు.
ప్రత్యేక సమీక్ష సదస్సు
సప్రీంకోర్టు నిబంధనల ప్రకారం భద్రతా నియమాలను రూపొందించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో హాస్పిటల్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. 14 సెప్టెంబర్ లోపు రిపోర్టు సమర్పించాలని, కేసుల విచారణ వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో హోం శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.