ఖమ్మం గ్రామీణ మండల పరిధిలోని ఎంవీపాలెం గ్రామానికి చెందిన నిదిగొండ పెద్దభిక్షం (50), వరలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ రెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ అక్కడే మూడు చక్రాల బండిపై ఐస్‌క్రీం విక్రయించుకుంటూ జీవిస్తున్నారు. సాయంత్రం వీరిద్దరూ బండి వద్ద నిల్చుండగా ఖమ్మం నుంచి కురవి వైపు అతి వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని అనంతరం ఈ దంపతులను ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి పక్కన ఉన్నే భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పెద్దభిక్షం చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరలక్ష్మి చికిత్స పొందుతోంది. ఘటనా స్థలాన్ని ఇన్‌స్పెక్టర్ రాజు సందర్శించారు. ఏదులాపురం గ్రామానికి చెందిన రవికుమార్ అనే యువకుడు ప్రమాదానికి కారకునిగా గుర్తించారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఇతను కొద్ది రోజుల క్రితం ఓ వివాహ వేడుక నిమిత్తం స్వస్థలం వచ్చారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.