నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారులతో కలిసి ఒడిశాకు వెళ్లిన భట్టి విక్రమార్క.. ఆ రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం మోహన్ చరణ్ తో భేటీ అయ్యారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో నైని కోల్ బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూడాలని కోరారు. అయితే, ఈ విషయంపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. నైనీ కోల్ బ్లాక్ లో తవ్వకాలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.