త్రిపుర రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్ (HIV infection) విజృంభించి, భయాందోళనకు గురి చేస్తుంది.ఈ వ్యాధి కారణంగా అక్కడ 48 మంది విద్యార్థులు మృతి చెందారు . సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి వెల్లడించారు. రాష్ట్రం మొత్తంలో 5674 కేసులు నమోదు అయ్యాయి.త్రిపురాలో ఉన్న 220 స్కూళ్లు, 24 కాలేజీలు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ఎయిడ్స్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజూ 5 -7 కొత్త కేసులు వస్తున్నాయి.
HIV ఎయిడ్స్ ఎంత ప్రమాదకర అంటువ్యాధో అందరికీ తెలిసిందే.ఈ వ్యాధికి ఇప్పటికీ మందులేదు.ఈ వ్యాధికి ప్రస్తుతం యాంటీ రిట్రోవైరల్ థెరపీ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయం దానికి మందులు ఉన్నా లేకపోయినా, ఆ వ్యాధి సోకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఎయిడ్స్ వచ్చేందుకు అసురక్షిత కలయిక ఒక్కటే కాదు. ఇంజెక్షన్ల ద్వారా కూడా వస్తుంది. ఒకే సిరంజితో డ్రగ్స్‌ను ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.డ్రగ్స్‌కు అలవాటుపడిన కొంతమంది విద్యార్థులు ఒకే సిరంజితో తీసుకోవడం వల్ల వ్యాధి వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకి ఉండవచ్చోని త్రిపురా స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) తెలిపింది. ఇక్కడి ఇనిస్టిట్యూట్స్‌లో చదువుతున్న విద్యార్థుల్లో చాలామంది ఉన్నత చదువుల కోసం త్రిపురకు వలస వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయపడుతున్నారు.త్రిపుర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలి,ఎయిడ్స్ నియంత్రణ కోసం విస్తృత ప్రచారం చేయాలి.విద్యార్థులందరికీ ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించి,వారు భయాందోళనకు గురి కాకుండా సైకాలజిస్ట్ తో కౌన్సిలింగ్ చేయించాలి.ఎయిడ్స్ సోకిన వారికి మంచి వైద్యం, ఆహారం అందేలా చూడాలని త్రిపుర ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
అనురాధ రావు
అధ్యక్షురాలు
బాలల హక్కుల సంఘం