ఇల్లు లేని నిరుపేదలకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలో అర్హులైన అభ్యర్థులందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. సోమవారం మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-2025 బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గట్టి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిబంధనల వల్లే ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.