రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశ ప్రజలు నాలుగోసారి తనపై విశ్వాసం ఉంచారని అన్నారు. 21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందని, వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని, పేదలు, మధ్య తరగతి ఆకాంక్షలు నెరవేర్చామని తెలిపారు. ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి, 4 కోట్ల పేదలకు గృహాలు అందించామని వివరించారు.
రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తూ, కొందరు నేతలు పేదలతో ఫొటోలు దిగినా, పార్లమెంట్‌లో చర్చలకు దూరంగా ఉంటారని విమర్శించారు. మేము బూటకపు హామీలు ఇవ్వలేదని, 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా పారదర్శకత తీసుకొచ్చామని, స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని తెలిపారు.