పేదవాడి ఆరోగ్యానికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రికగా పేరుగాంచిన ఈ పథకం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సంజీవనిగా నిలిచిందని ఆమె గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలను నిలిపివేయడంతో పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిందని మండిపడ్డారు.

ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలిచి, పెండింగ్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పథకాన్ని సక్రమంగా కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని ఆమె సూచించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవాలని షర్మిల అన్నారు.

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడం వల్ల సోమవారం నుంచి వైద్య సేవలు నిలిచిపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి, “ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, పథకాన్ని పునరుద్ధరించండి” అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

Loading

By admin

error: Content is protected !!