ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, కంభం మండలం రావిపాడకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్‌ఓసీ (లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద 30 మంది జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
పెట్రోలింగ్ సమయంలో సుబ్బయ్య అనుకోకుండా ల్యాండ్ మైన్‌పై కాలుచేశారు. వెంటనే మైనుకు సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించిన ఆయన, తన తోటి సైనికులకు “గో బ్యాక్” అని గట్టిగా కేకలు వేసి వారిని అప్రమత్తం చేశారు. ఈ సమయంలో మైన్ పేలిపోయింది, దీంతో సుబ్బయ్య అక్కడికక్కడే మరణించారు. కానీ, ఆయన తన జీవితం ధారపోసి 30 మంది సైనికులను రక్షించారు.
సుబ్బయ్య వీరత్వం అందరి మనసులను కదిలిస్తోంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ అమరుడి గౌరవార్థం ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన సేవలను గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన త్యాగం సైనిక లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది.
సుబ్బయ్య కుటుంబ సభ్యులు ఈ వార్త విని గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామంలో శోకసంద్రం నెలకొంది. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సైనిక అధికారులు ఈ అమరుడికి నివాళులు అర్పిస్తున్నారు.