హైదరాబాద్: ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సూచించారు.
తెలంగాణ తల్లి విశిష్టత
తెలంగాణ తల్లి రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక సంప్రదాయాలు, వ్యవసాయ ఆధారిత జీవనశైలిని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతీక భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఉద్దేశించింది. తెలంగాణ తల్లిని జాతి అస్తిత్వం మరియు ఆత్మగౌరవ ప్రతీకగా భావిస్తూ, ప్రత్యేక రూపురేఖలతో విగ్రహాన్ని ఆమోదించింది.
చిత్రాన్ని వక్రీకరించడం నిషేధం
తెలంగాణ తల్లి చిత్రాన్ని లేదా రూపాన్ని వక్రీకరించడం, అవహేళన చేయడం, అవమానించడం వంటి చర్యలు పూర్తిగా నిషేధించబడినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో ఈ రూపాన్ని అగౌరవపర్చడం నేరంగా పరిగణించబడుతుందని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.
చర్యలు
ఈ చిహ్నాన్ని గౌరవించకపోవడం లేదా దూషించడం వంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి ఛాయాచిత్రాన్ని విడుదల చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.