హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనేక సమస్యలు ఉలిక్కిపడేలా ఉన్నాయి. తాగునీటి కొరత, మరుగుదొడ్ల అభావం, టీచర్ల కొరత వంటి ఇబ్బందులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పర్యటించి విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించారు.
విద్యార్థులు ప్రస్తావించిన ముఖ్య సమస్యలు:
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటుకు డిమాండ్.
మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపర్చడం, ఉదయం అల్పాహారం అందించడం.
తాగునీటి సమస్య పరిష్కారం, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది నియామకం.
విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను అందించడం, ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు.
హైస్కూళ్లు, కాలేజీల్లో పీఈటీలు, పీడీ పోస్టుల భర్తీ, ఆటస్థలాల ఏర్పాటు.
షిఫ్ట్ విధానాన్ని ఎత్తివేసి 9.30 AM – 4.30 PM తరగతులు నిర్వహించడం.
సైన్స్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, పేరెంట్స్ కమిటీ సమావేశాలను ప్రతినెల నిర్వహించడం.
కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూయేషన్ (సీసీఈ) విధానం రద్దు.
హైదరాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన బహిరంగ విచారణలో విద్యార్థులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం విద్యా బడ్జెట్‌ను పెంచి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.