తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే-2024ను పూర్తి చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఈ సర్వే చేపట్టామని, 66.99 లక్షల కుటుంబాల సమాచారం సేకరించి 96.9% సర్వే పూర్తయిందని తెలిపారు.
సర్వే ప్రకారం, రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ముస్లీం మైనార్టీ బీసీలు 10.08% కాగా, మొత్తం బీసీ జనాభా 56%గా ఉంది. ముస్లీంలతో సహా ఓసీలు 15.79%గా ఉన్నారని సీఎం వెల్లడించారు.
దేశవ్యాప్తంగా బలహీన వర్గాల గణన లేకపోవడం వల్ల రిజర్వేషన్ విధానంలో సమస్యలు వస్తున్నాయని, 1931 తరువాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కులగణన జరపలేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణలో కులగణన చేస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు.
76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు కృషి చేసి రూ.160 కోట్ల వ్యయంతో నివేదికను రూపొందించినట్లు తెలిపారు. కేబినెట్ ఆమోదంతో చట్టబద్ధత కల్పించామనీ, 56% బీసీలకు తగిన గౌరవం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా ఈ నివేదికను సిద్ధం చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు.