తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) 77వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గద్దర్‌ను సమాజానికి గొప్ప స్ఫూర్తిగా పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం గద్దర్ రచించిన “మా పల్లె” పుస్తకాన్ని ఆవిష్కరించారు. గద్దర్ ఫోటో ప్రదర్శనను ప్రారంభించి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
సీఎం మాట్లాడుతూ, గద్దర్ సమాజాన్ని మార్చేందుకు పాటను, కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించారని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గద్దర్ పేరిట అవార్డు ఏర్పాటు చేయడంతోపాటు, పద్మ పురస్కారాల కోసం గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావుల పేర్లు కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రాలు కలిసి కేంద్రం అవుతాయని, ఏ వ్యక్తి రాజ్యం కాదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి గద్దర్‌కు పురస్కారం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గోరటి వెంకన్న, ప్రొ. కోదండరాం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గంటా చక్రపాణి, ప్రొ. కంచె ఐలయ్య, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, అల్లం నారాయణ, కే.శ్రీనివాస్, విమలా గద్దర్, గద్దర్ ఫౌండేషన్ సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.