TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ కుమార్తె వెన్నెలతో పాటు అనేక మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంగటి మనోహర్ మహాజన్

బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంగటి మనోహర్ మహాజన్ ఆగ్రహంతో స్పందించారు. “మెడకాయమీద తలకాయ లేనివాడిలా నిరాధార ఆరోపణలు, అసత్యాలు, అభూతకల్పనలతో గద్దర్‌ను విమర్శించడం ఎంత మాత్రం సమంజసమా?” అని ప్రశ్నించారు. గద్దర్ భావజాలం గురించి మాట్లాడుతూ, “గద్దర్ బీజేపీ కార్యకర్తలను చంపించాడు” అని బండి సంజయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “మీ దగ్గర ఏకమైనా ఆధారం ఉందా? నిజంగా గద్దర్ నీవు చెప్పిన వ్యక్తిత్వం కలిగినవాడే అయితే, ఎందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గద్దర్ సేవలను ప్రశంసిస్తూ గొప్పగా లేఖ రాస్తారు? అంటే ప్రధాన మంత్రికి నీవు చెప్పిన విషయాలన్నీ తెలియక ఇలా వ్రాశాడా?” అని నిలదీశారు.

సంగటి మనోహర్ మహాజన్ బండి సంజయ్ వ్యాఖ్యలను “జొల్లుకూతలు, కారుకూతలు, పిచ్చికూతలు మరియు తప్పుడుకూతలు”గా అభివర్ణిస్తూ, “ఇలాంటివి ప్రజలను తికమకపెడతాయి, గందరగోళపరుస్తాయి” అని విమర్శించారు. “గద్దర్ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని అర్పించారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా పోరాడిన వ్యక్తి ఆయన. బండి సంజయ్ చేసిన అవాస్తవాలు, అసత్యాలు, అవాకులుచెవాకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గద్దర్ అభిమానులను బాధించాయి” అని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గద్దర్ కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గద్దర్ అభిమానులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. “ఇటువంటి బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.

మహాజన్ మాట్లాడుతూ, “రండి, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిద్దాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం, పరిరక్షించుకుందాం. నూతన ప్రజాస్వామిక విప్లవానికి జైభీములు మరియు బుద్ధవందనాలతో ఆందోళన వ్యక్తం చేద్దాం” అని పిలుపునిచ్చారు.

(సంగటి మనోహర్ మహాజన్)
వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి & మహాజన రాజ్యం పార్టీ ;
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
కడప, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా – 9849508416.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version