తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం పునరాలోచన అవసరాన్ని తెరపైకి తెస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో రిటైర్మెంట్ వయస్సును 58 నుండి 61 ఏళ్లకు పెంచడం ద్వారా తాత్కాలికంగా భారం తప్పించుకుంది. అయితే ఈ నిర్ణయానికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావం పలు విధాలుగా వెల్లడవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ రిటైర్మెంట్ బెనిఫిట్లతో పాటు పెన్షన్ చెల్లింపుల భారం ఎదుర్కొంటోంది.
గత ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమైన రిటైర్మెంట్ ప్రక్రియలో 8,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వచ్చే ఐదేళ్లలో 50,000 మందికిపైగా రిటైర్ కానున్నారు. వీరి బెనిఫిట్లకు ప్రభుత్వం సుమారు ₹40,000 కోట్ల అదనపు ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్లపై రాష్ట్ర ఆదాయంలో 35% వినియోగిస్తున్న ప్రభుత్వం, ఈ అదనపు భారం మోయడానికి ఆర్థిక సర్దుబాట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కానీ, రిటైర్మెంట్ వయసు పెంపు గురించి జరుగుతున్న ప్రచారాలను ప్రభుత్వం ఖండించింది. రిటైర్మెంట్ వయస్సును పెంచడం వల్ల ప్రమోషన్లు నిలిచిపోవడం, జాబ్ క్యాలెండర్‌కు ఆటంకం కలగడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చనే భావనతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
రాష్ట్రం ముందుకుసాగేందుకు తగిన ఆర్థిక ప్రణాళికలు అవసరం. కొత్త ఉద్యోగాల భర్తీ, డీఏ పెంపు, మెడికల్ బిల్లుల చెల్లింపుల వంటి అంశాల్లో సమతుల్యత సాధించడం ప్రస్తుతం కీలకం. ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరులపైనే , సంక్షేమ పథకాలకు మద్ధతు కొనసాగిస్తూ, ఉద్యోగుల కోసం సమగ్ర వ్యూహాన్ని రూపొందించడం అవసరం.