కొత్తగూడెం నగరాన్ని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని, కార్పొరేషన్ ఏర్పాటుతో విస్తృతంగా నిధులు రాబడతాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో రెండో పారిశ్రామిక జిల్లాగా మారుతుందని వెల్లడించారు.
పాల్వంచ మున్సిపాలిటీకి 25 ఏండ్లుగా ఎన్నికలు జరగకపోవడం అభివృద్ధిని నిలిపివేసిందని, కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచకు కొత్త మార్గం తెరుచుకుంటుందని చెప్పారు. ట్యాక్స్‌లు పెరుగుతాయనే అభిప్రాయం అసత్యమని, గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
త్వరలో కొత్తగూడెంకు ఎయిర్‌పోర్టు ఏర్పాటు, పాల్వంచలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల గ్రామాలను కార్పొరేషన్ పరిధిలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రణాళికల అమలులో ముగ్గురు మంత్రుల సహకారం కీలకమని ఆయన తెలిపారు.