తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరేలా చూపించడం నిషేధించబడింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాల్లో అవమానించడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం నేరంగా పరిగణించబడుతుంది. డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరపాలని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ తల్లి రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని ప్రతిబింబించే చిహ్నంగా భావిస్తుందని జీవోలో పేర్కొంది.