భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మలోతు అశోక్ బాబు కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలు, అలాగే పరిసర గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గిరిజన ప్రజల హక్కులను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో గిరిజన ప్రజలకు ఉద్యోగాలు, ఐటీడీఏ ద్వారా అందే అభివృద్ధి పథకాలు, పంచాయతీ హక్కులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో గిరిజన ప్రజలకు దక్కాల్సిన ప్రత్యేకాధికారాలు నష్టం చెందుతాయని, 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో కలపడం వల్ల ప్రజలకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కోల్పోతారని స్పష్టం చేశారు. చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, సుజాతనగర్ వంటి ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి దిశగా ఉన్నాయని, ఈ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో చేర్చడం అసమంజసం అని అభిప్రాయపడ్డారు.
అశోక్ బాబు మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో గ్రామాలను కార్పొరేషన్‌లో కలపడం వెనుక కేవలం గిరిజన భూములను లాక్కోవాలనే కుట్రే ఉన్నట్లు ఆరోపించారు. ఏజెన్సీ హక్కుల కోసం గిరిజనులు సాగిస్తున్న ఉద్యమాలను తక్షణమే నెగ్గించాలని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాజకీయ నాయకులు చేసే అభివృద్ధి ప్రచారాలను తప్పు పట్టారు.
ఏజెన్సీ ప్రాంతాల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.