ర్యాగింగ్ చేసే వారిని వదిలిపెట్టేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ర్యాగింగ్ పెద్ద సమస్యగా మారిందని, ర్యాగింగ్ చేసినా, డ్రగ్స్ సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో తేడాలు కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడాలని సూచించారు. శనివారం మాసబ్ ట్యాంక్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో డ్రగ్స్ నిరోధం, ముఠాల నిరోధంపై నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ ప్రభాకర్, సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. ర్యాగింగ్ వల్ల కొంత మంది విద్యార్థులు కాలేజీలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు.
ర్యాగింగ్‌ను నిషేధించామని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ర్యాగింగ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ర్యాగింగ్ నిరోధానికి పోలీసు శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.ర్యాగింగ్ ట్రాప్‌లో ఎవరూ పడవద్దని హెచ్చరించారు. ఈ హాలులో కూర్చున్న వారంతా పోలీసులకు అంబాసిడర్లుగా ఉంటూ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు సహకరించాలన్నారు. యువత డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ వల్ల వారి జీవితాలే కాకుండా కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.