తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేస్తున్నారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి” అని సూచించారు.
▪️ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందని చెప్పారు.
▪️ ఈ సమావేశంలో ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రిగారు అధికారులతో చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రివర్యులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.