TwitterWhatsAppFacebookTelegramShare

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ

   ఆయుర్వేదం నందు లవణమును (ఉప్పు) 6 రకాలుగా వర్గీకరించారు. అవి 
  • సైన్ధవ లవణము
  • సాముద్ర లవణము
  • బిడా లవణము
  • సౌవర్చ లవణము
  • రోమక లవణము
  • ఔద్బిద లవణము

  • సైన్ధవ లవణము – హృద్రోగము నందు , వాపుల యందు , రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఉప్పు నిషిద్ధమైనప్పటికీ సైన్ధవ లవణమును కొద్దిమోతాదులో వాడవచ్చు . సింధుపర్వత ప్రాంతమున భూగర్భగనుల నుండి సేకరించుట చేత దీనికి సైన్ధవ లవణం అని పేరువచ్చింది. ఇది సహజముగా పరిశుద్ధం అయినది. ఆకలిని పుట్టించును . ఆహారమును జీర్ణం చేయును . చలువ చేయును . నేత్రములకు మంచిది . వాత, పిత్త, కఫ దోషముల యందు పనిచేయును . వ్రణములను శోధించి మాన్పును . నేత్రరోగులకు మంచిది . దాహమును అణుచును . విరేచనం చేయును . శ్లేష్మాన్ని కరిగించును. పాలతో కలిపి పుచ్చుకొనవచ్చు. దీనిని అమితముగా పుచ్చుకొనిన పైత్యమును చేయును . అతిసార రోగమును పుట్టించును.

  • సాముద్ర లవణము – ఈ లవణమును సముద్రపు నీరు ఎండబెట్టి చేయుదురు . ప్రతిరోజు మనం వాడుకునే ఉప్పు ఈకోవలోకే వచ్చును. ఇది విరేచనకారి , ఆకలిని పెంపొందించును. శ్లేష్మాన్ని వృద్ధిచెందించును . వాతాన్ని అణుచును. కఫవాతము , గుల్మము , విషము , శ్వాసకాస వీనిని హరించును . నేతిలో ఉప్పు వేసి పుచ్చుకొనిన శూలలు ( నొప్పులు ) తగ్గును. పరిణామ శూలతో అనగా ఆహారం అరుగు సమయములో నొప్పితో ఇబ్బందిపడేవారు భోజనం చేసే సమయములో మొదటిముద్దలో కొంచం ఉప్పు కలుపుకుని తినుచున్న పరిణామశూల నయం అగును. 5 గ్రాముల సాముద్ర లవణమును చల్లని నీటితో కలిపి ఇచ్చిన రక్తముతో కూడిన వాంతులు నయం అగును. తేలు కుట్టినప్పుడు 5 గ్రాముల ఉప్పు నీటితో కలిపి కరిగిన తరువాత ఇచ్చిన తేలు విషం వెంటనే తగ్గును. వేడినీటితో పుచ్చుకొనిన వాంతి చేయును . కడుపులో నొప్పి , గుండెల్లో నొప్పి వచ్చు సమయమున ఉప్పును ఒక కడాయిలో వేసి వేయించి ఒక గుడ్డలో పోసి మూటకట్టి నొప్పి భాగములో కాపడం పెట్టిన తగ్గును. వాతము , శ్లేష్మములను హరించి శరీరానికి వేడిపుట్టించును. ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కొన్నిరకాల దుర్గుణాలు కలుగును. ఎముకలు మరియు వీర్యము యొక్క బలాన్ని తగ్గించును . నేత్రవ్యాధులు , రక్తస్రావము , కుష్ఠు , విసర్పి , వెంట్రుకలు రాలిపోవుట , తెల్లబడుట వంటి దుర్గుణాలు కలుగును.
  • మిగిలిన లవణాలు అయిన సౌవర్చలవణము , బిడా లవణము , ఔద్బధ లవణము , రోమక లవణము వంటివి సురేకారముతో తయారుచేయును . వాటిని ఔషధముల యందు మాత్రమే ఉపయోగిస్తారు . ఆహారం నందు వాడుటకు పనిచేయవు .లవణములు అన్నియు లవణ రసమును కలిగి ఉండి వేడిచేయు గుణమును కలిగి ఉండును. ఆహారంలో ఉపయోగించుటకు అన్ని లవణముల కంటే సైన్ధవ లవణము మంచిది.

కాళహస్తి వేంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

        9885030034

Loading

By admin

Exit mobile version